కరీనాకపూర్ ఖాన్, టబు, కృతిసనన్ కలిసి ప్రాజెక్ట్ మొదలుపెట్టేశారు. ఈ ముగ్గురూ కలిసి నటిస్తున్న సినిమా పేరు ది క్రూ. చాన్నాళ్లకు ముందే అనౌన్స్ అయిన ప్రాజెక్ట్ ది క్రూ. ఈ సినిమా ఎట్టకేలకు సెట్స్ మీదకు వెళ్లిందని పిక్ షేర్ చేశారు రియా కపూర్. కరీనాకపూర్, టబు, కృతిసనన్‌ని స్క్రీన్ మీద చూడటానికి కళ్లు సరిపోవని స్టేట్‌మెంట్ ఇచ్చారు రియా కపూర్. రియా పిక్ పోస్ట్ చేస్తూ ``ఇది నిజ జీవితంలో జరుగుతోందా?`` అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తపరచారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు వండర్‌ఫుల్ లేడీస్‌తో ది క్రూ తెరకెక్కుతోందని అన్నారు.
కరీనాకపూర్ నటించిన లాల్‌సింగ్ చడ్డా గత ఏడాది విడుదలైంది. ఆమీర్ ఖాన్‌తో నటించిన సినిమా లాల్ సింగ్ చడ్డా. ఈ సినిమా ప్రమోషన్లలోనే తొలిసారి ది క్రూ మూవీ గురించి మాట్లాడారు కరీనాకపూర్ ఖాన్. ఈ సినిమా గురించి కరీనాకపూర్ మాట్లాడుతూ ``రియా కపూర్‌తో ఓ సినిమా చేస్తున్నాను. అది వీరే2 కాదు. ముగ్గురు మహిళలకు సంబంధించిన స్క్రిప్ట్ తో తెరకెక్కుతోంది. కాస్త వైవిధ్యంగా అనిపించే సినిమా అది. సూపర్ కూల్‌గా ఉంటుంది. ఫన్ స్టోరీ`` అని స్పందించారు.
టబు నటించిన భోళా నార్త్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత ఆమె నుంచి ఫ్యాన్స్ కి అందే గిఫ్ట్ ది క్రూ. మరోవైపు కృతిసనన్ కూడా ది క్రూ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. పీర్ గ్రూప్‌తో ఎన్ని సినిమాలు చేసినా ఆనందంగా ఉండదు. అదే సీనియర్లతో స్క్రీన్ పంచుకుంటుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుందన్నది కృతిసనన్ చెప్పే మాట. ఆల్రెడీ తెలుగువారికి పరిచయమైన కృతి సనన్ త్వరలోనే ఆదిపురుష్ తో మరో సారి మన వారిని పలకరించనున్నారు.
మనకు కరీనాకపూర్‌తో పెద్దగా పరిచయం లేదు గానీ, టబు, కృతిసనన్‌తో మంచి పరిచయమే ఉంది. ది క్రూని తెలుగులోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏక్తా కపూర్, రియా కపూర్ కలిసి నిర్మిస్తున్న సినిమా ఇది. ఎయిర్‌లైన్ ఇండస్ట్రీలో పనిచేసే ముగ్గురు అమ్మాయిలకు సంబంధించిన కథ ఇది. వాళ్లకు ఎదురైన పరిస్థితులు, వాటి నుంచి వాళ్లు ఓవర్‌కమ్ అయిన విధానం గురించి ఈ సినిమాలో ప్రస్తావిస్తున్నారు.